పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు అన్ని రేంజీల డీఐజీలు, జిల్లా ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు మెమో జారీ చేశామన్నారు. ప్రజలు తమ సమస్యలపై కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు నేరం లేదా ఘటన జరిగిన చోటు తమ పరిధిలో లేదని వెనక్కి పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇది సరికాదని పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తమ పరిధిలో లేని చోట నేరం జరిగినా దానిపై ఫిర్యాదు వస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఆ తర్వాత దాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ166–ఏ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశిస్తామని, శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని యూనిట్ల అధికారులు తమ పరిధిలోని పోలీసుస్టేషన్లు, అధికారులకు ఈ మార్పును తెలిపి అమలయ్యేలా చూడాలన్నారు. 'స్పందన' కార్యక్రమంలో ఇప్పటికే 11 వేల కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో 18 శాతం మహిళలపై వేధింపులవేనని, ఫిర్యాదుదారుల్లో 52 శాతం మహిళలేనని వెల్లడించారు.